Congress: ప్రత్యామ్నాయ పదవులతో ఆశావహులను బుజ్జగిస్తున్న కాంగ్రెస్‌ ఎంపిక కమిటీ

  • టికెట్ల కోసం ఎదురు చూస్తున్న వారితో సంప్రదింపుల పర్వం
  • వార్‌ రూంలో హాట్‌హాట్‌గా చర్చలు
  • అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తామని హామీ

మహా కూటమి సీట్ల సర్దుబాటుతో తగ్గిన స్థానాలు, మరోవైపు టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉండడంతో కాంగ్రెస్‌లో బుజ్జగింపుల పర్వం జోరుగా సాగుతోంది. ఆశావహులకు ప్రత్యామ్నాయ పదవుల ఎరచూపి సంతృప్తి పరిచేందుకు ఎంపిక కమిటీ తీవ్ర స్థాయిలో కష్టపడుతోంది. అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న పలువురితో వార్‌ రూంలో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌, శర్మిష్ఠ ముఖర్జీ తదితరులు మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.

పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ పదవులు ఇస్తామని నచ్చజెపుతున్నారు. సూర్యాపేట నుంచి పటేల్ రమేష్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, దామోదర్ రెడ్డి, మంచిర్యాల నుంచి అరవింద్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు, ఇల్లందు నుంచి హరిప్రియ, సికింద్రాబాద్ నుంచి బండ కార్తీక రెడ్డి సీట్లను ఆశిస్తున్నారు. అలాగే మునుగోడు, మంచిర్యాల, వికారాబాద్ నుంచి పాల్వాయి స్రవంతి, ప్రేమ్ సాగర్ రావు, చంద్రశేఖర్ లు టికెట్ల కోసం పట్టుపడుతున్నారు.

నాగర్ కర్నూల్, నకిరేకల్, మహబూబ్ నగర్, తుంగతుర్తి  నుంచి మణెమ్మ, ధనమ్మ, ఒబెడుల్ల కొత్వాల్, అద్దంకి దయాకర్ పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఆశావహులు అధికంగా ఉండడంతో వారందరిని గాంధీభవన్ కు పిలిపించి ఎంపిక కమిటీ సంప్రదింపులు జరుపుతోంది.

More Telugu News