Telangana: ఒక్కో టీఆర్ఎస్ అభ్యర్థికి ఒక్కో లాయర్.. పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్న టీఆర్ఎస్ అధినేత!

  • అభ్యర్థులందరికీ హైకమాండ్ నుంచి ఫోన్లు
  • అందుబాటులో ఉండాలని ఆదేశం
  • ఈ నెల 11న బీ-ఫారాల కేటాయింపు

వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం నుంచి నామినేషన్ల వరకూ ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేతలకు ఈ రోజు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. నేతలంతా పార్టీకి అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా హైకమాండ్ ఆదేశించింది.

ఈ నెల 11న పార్టీ అధిష్ఠానం అభ్యర్థులకు బీ-ఫారాలను అందించనుంది. అలాగే అదే రోజున మిగిలిన 12 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులతో పాటు 12 నియోజకవర్గాల్లోని ఆశావహులు అందుబాటులో ఉండాలని అధిష్ఠానం ఆదేశించింది.

కాగా, ఒక్కో అభ్యర్థికి ఈ సందర్భంగా ఒక్కో లాయర్ ను పార్టీ కేటాయించింది. నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పత్రాలు తిరస్కరణకు గురికాకుండా హైకమాండ్ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటోంది.

More Telugu News