kapilavail lingamurthy: ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం

  • హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • రేపు ఆయన స్వస్థలంలో అంత్యక్రియలు
  • కపిలవాయి కుటుంబసభ్యులకు కేసీఆర్ సానుభూతి

ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి (90) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు మృతి చెందారు. ఆయన స్వస్థలమైన మహబూబ్ నగర్ జిల్లా బల్మూరు మండలంలోని జినుకుంట గ్రామంలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కాగా, మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకు 1928 మార్చి 31న లింగమూర్తి జన్మించారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్ (ఎంఓఎల్ తెలుగు)లో ఆయన పట్టా పొందారు.1954లో నాగర్ కర్నూల్ జాతీయోద్యమ పాఠశాలలో తెలుగు పండితుడిగా చేరారు.

1972లో పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకులుగా చేరి పదేళ్ల పాటు సేవలందించారు.1983లో ఉద్యోగవిరమణ పొందారు. పలు గ్రంథాలు, పరిశోధనలు రచించిన లింగమూర్తి సాహితీవేత్తగా పేరు పొందారు. 2014లో తెలుగు యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో ఆయన్ని సత్కరించింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు యూనివర్శిటీ నుంచి తొలి గౌరవ డాక్టరేట్ పొందిన వ్యక్తి లింగమూర్తి కావడం విశేషం. స్థల చరిత్రలు, దేవాలయాల కథలు లింగమూర్తి రాశారు. మొత్తం 70 రచనలు చేశారు.  

రాష్ట్రం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది

కపిలవాయి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కపిలవాయి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయిందని కేసీఆర్ నివాళులు అర్పించారు. 

More Telugu News