YSRCP: ఇలాంటి దాడి టీడీపీ నాయకులపై జరిగితే ఈ పాటికి గుడ్డలు చింపేసుకునేవాళ్లు: కమేడియన్ పృథ్వీరాజ్

  • ఓ ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే అవహేళన చేస్తారా?
  • నిమ్మకునీరెత్తినట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది
  • జగన్ పై దాడి చాలా దురదృష్టకరం
ఓ ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా, నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని వైసీపీ నాయకుడు, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జగన్ పై దాడి ఘటన చాలా దురదృష్టకరమని, ఓ సినిమా షూటింగ్ నిమిత్తం బ్యాంకాక్ వెళ్లడం వల్లనే తాను వెంటనే రాలేకపోయానని అన్నారు.

ఈ దాడికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, దాడి జరిగిన ప్రదేశం కేంద్రం పరిధిలో ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెప్పడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే ప్రెస్ మీట్స్ పెట్టి నవ్వుతూ, అవహేళన చేశారని టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఇలాంటి దాడి టీడీపీ నాయకులపై జరిగితే ఈ పాటికి గుడ్డలు చింపేసుకుని, రోడ్ల మీద పడిపోయి ‘ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానం’ అని గోలగోల చేసేవారని, ‘ధర్మపోరాటం’ అంటూ ఏవో సభలు పెడుతున్నారుగా, అలాంటి సభలే పెట్టి.. కొంగజపాలు చేస్తూ రాష్ట్రానికి ఏదో జరిగిపోయినట్టు చేసే వారని అన్నారు.
YSRCP
jagan
Telugudesam
Chandrababu
prudhviraj

More Telugu News