ap assembly: కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ పచ్చజెండా!

  • రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరిట స్టీల్ ప్లాంట్
  • రూ.18 వేల కోట్ల వ్యయంతో నిర్మాణం 
  • ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

కడప జిల్లాలో రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరిట స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. అమరావతిలో ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశం జరిగింది. ఈ సుదీర్ఘ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రూ.18 వేల కోట్ల వ్యయంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని, నెలరోజుల్లోగా శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ కు, పోర్టు ఏర్పాటుకు రామాయపట్నం అన్ని విధాలుగా అనుకూలమనే దిశగా కీలక చర్చలు జరిపినట్టు సమాచారం. విశాఖలో పీపీపీ పద్ధతిలో, మూడు కారిడార్లలో 42.55 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు, విశాఖ ల్యాండ్ పూలింగ్ విధానంలో మార్పులు చేర్పులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

విశాఖ జిల్లాలో భూమి దస్త్రాల ట్యాంపరింగ్ పై దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది. అగ్రిగోల్డ్ వ్యవహారంపైనా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రానికి మరోసారి లేఖ రాయాలని, ఈ ఉక్కు పరిశ్రమలో కేంద్రం కూడా వాటాదారుగా చేరాలని ప్రధాని మోదీకి లేఖ రాయాలని మంత్రి వర్గం నిర్ణయించినట్టు సమాచారం. ఏపీ విభజన హామీలపై మరోమారు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని రెండో లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

More Telugu News