avni: పులిని చంపిన ఘటనపై రాహుల్ గాంధీ ట్వీట్

  • 13 మంది ప్రాణాలను బలిగొన్న పులిని కాల్చి చంపిన ఘటన
  • మహాత్మాగాంధీ వ్యాఖ్యలను ఊటంకించిన రాహుల్ గాంధీ
  • ఇది అత్యంత దారుణమైన హత్య అన్న కేంద్ర మంత్రి మేనకా గాంధీ

మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో అవని అనే ఆడపులిని కాల్చి చంపిన ఘటనపై ఎంతో మంది మండిపడుతున్నారు. మానవరక్తాన్ని రుచి మరిగినంత మాత్రాన... పులిని ఎలా చంపుతారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'మన దేశ గొప్పదనాన్ని.. జంతువుల పట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నామనే విషయం తెలియజేస్తుంది' అంటూ మహాత్మాగాంధీ చెప్పిన మాటలను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. తద్వారా పులిని చంపడంపై ఆయన తన నిరసనను, ఆవేదనను వ్యక్తం చేశారు.

మరోవైపు, పులిని చంపిన తర్వాత... పులుల సంరక్షణకు సంబంధించిన చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి మేనకాగాంధీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తయారయ్యాయి. ఇది ముమ్మాటికీ అత్యంత దారుణమైన హత్య అని, ముమ్మాటికీ నేరమేనని ఆమె మండిపడ్డారు. ఈ కేసును చట్టపరంగా, నేరపరంగా, రాజకీయపరంగా ముందుకు తీసుకెళ్లాలని ఆమె చెప్పారు.

గత రెండేళ్ల కాలంలో అవని పులి 13 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ నేపథ్యంలో, పులి కనిపిస్తే చంపేయాలని ఈ ఏడాది సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, పులి ప్రాణాలను కాపాడాలని కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. 

More Telugu News