Andhra Pradesh: జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుది ఐరన్ లెగ్.. ఆయనతో పెట్టుకున్నవాడెవడూ బతికిబట్ట కట్టలేదు!: వైసీపీ నేత రోజా

  • తనపై దాడిపై జగన్ హుందాగా స్పందించారు
  • ఇదే చంద్రబాబుపై జరిగుంటే ఓవర్ యాక్షన్ చేసేవాళ్లు
  • జగన్ ఆసుపత్రిలో ఉంటే కడపలో సభ పెట్టారు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగితే సీఎం చంద్రబాబు వికృతంగా ప్రవర్తిస్తూ శునకానందం పొందుతున్నారని వైసీపీ నేత రోజా విమర్శించారు. ఇప్పటి నుంచి చంద్రబాబును అందరూ శునకానంద పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సంబోధించాలని పిలుపునిచ్చారు. విలువలు, మానవత్వం పాటిస్తున్నారు కాబట్టే జగన్ పై దాడిని తెలంగాణతో పాటు జాతీయస్థాయి నేతలు ఖండించారని రోజా వ్యాఖ్యానించారు.

చంద్రబాబులో ఈ విలువలు, మానవత్వం లేవు కాబట్టే మీడియా సమావేశం పెట్టి వెటకారంగా మాట్లాడారని దుయ్యబట్టారు. వైఎస్ మరణం తర్వాత తనకు ఎదురులేదని చంద్రబాబు భావించారని రోజా తెలిపారు. అయితే సుడిగాలిలా జగన్ రాజకీయాల్లోకి రావడంతో ఆయన్ను అడ్డు తప్పించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. జగన్ పై జరిగిన స్థాయిలోనే చంద్రబాబుపై దాడి జరిగి ఉంటే ఆయన ఓవర్ యాక్షన్, కుల మీడియా కవరేజ్ ఏ స్థాయిలో ఉండేదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు

రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలగకూడదన్న ఉద్దేశంతోనే జగన్ సైలెంట్ గా చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లిపోయారని తెలిపారు. అక్కడి నుంచి తాను ఆరోగ్యంగానే ఉన్నాననీ, భయపడవద్దని ప్రజలు, వైసీపీ కార్యకర్తలకు తెలిపారన్నారు. జగన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే చంద్రబాబు ధర్మపోరాట దీక్ష పేరుతో కడపలో చిందులు వేశారని మండిపడ్డారు. జగన్ ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందినవాడు కాదని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించడంపై స్పందిస్తూ..‘నాయకుడు అనేవాడికి కులం ముఖ్యం కానేకాదు.. గుణమే ముఖ్యం’ అని చెప్పారు.

కడపలో సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, దివాకర్ రెడ్డితో జగన్ ను తిట్టించి కుల రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే చంద్రబాబు నిన్న ప్రకాశం జిల్లాలో కులాల పేరుతో ఓట్లు అడగరాదని నీతులు వల్లిస్తున్నారని పేర్కొన్నారు. హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై పోరాడకుండా సందుల్లో, వీధుల్లో సభలు ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుతో జాతీయ స్థాయిలో పొత్తు పెట్టుకున్నవారు ఎవరూ బాగుపడిన చరిత్ర లేదని రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబుతో పొత్తు పెట్టుకున్న ఐకే గుజ్రాల్ ఆ తర్వాత రాజకీయాల్లోంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. అనంతరం ప్రధానులుగా వచ్చిన దేవెగౌడ, అటల్ బిహారీ వాజ్ పేయిలకు అదే గతి పట్టించారని విమర్శించారు.

అలాంటి చంద్రబాబు చిన్నవయసులో ఉన్న రాహుల్ గాంధీతో ఇప్పడు పొత్తు పెట్టుకున్నారని వెల్లడించారు. రాహుల్ పరిస్థితిపై తనకు జాలివేస్తోందన్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఐరన్ లెగ్ అనీ, ఆయనతో పెట్టుకున్నవాళ్లు ఎవ్వరూ బాగుపడలేదని రోజా విమర్శించారు. జగన్ పై దాడి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ పరిధిలో లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News