Telangana: సినిమాల్లోకి వెళ్లవద్దని చెప్పిన అత్త.. కత్తితో దాడిచేసి పరారైన అల్లుడు!

  • సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఘటన
  • భార్య, అత్తపై దాడిచేసిన నిందితుడు
  • అయినా అల్లుడినే సమర్థిస్తున్న అత్త కనకలక్ష్మి

‘సినిమాల్లోకి వెళ్లొద్దు అల్లుడు’ అని కోరినందుకు ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. నాకే అడ్డు చెబుతావా? అంటూ పిల్లనిచ్చిన అత్తతో పాటు కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో చోటుచేసుకుంది.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన కనకలక్ష్మి కుమార్తె జోత్స్న, అల్లుడితో కలిసి ఇక్కడి గౌతమ్ నగర్ లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తాను సినిమాల్లో నటించేందుకు వెళతాననీ, తనకు ఆఫర్లు వచ్చాయని అల్లుడు ఇంట్లో చెప్పాడు. దీంతో అత్త కనకలక్ష్మి జోక్యం చేసుకుంటూ.. సినిమాల్లోకి వెళ్లి జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించింది. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి సినిమాల్లోకి పోతే కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని ప్రశ్నించింది. తల్లికి కుమార్తె జోత్స్న కూడా తోడవ్వడంతో సదరు ప్రబుద్ధుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.

కూరగాయలు కోసే కత్తితో కనకలక్ష్మిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన భార్యపై కూడా దాడిచేశాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం అధికారులు గాలింపును ప్రారంభించారు. ఇంత జరిగినా తన అల్లుడు మంచివాడని, తాగుడు, పేకాట వంటి దురలవాట్లు లేవనీ, అయినా ఎందుకు ఇలా చేశాడో తెలియడం లేదని కనకలక్ష్మి చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News