పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకున్న మైనింగ్ మాఫియా.. నడుచుకుంటూ ముందుకెళ్లిన జనసేన అధినేత!
- తూర్పుగోదావరి జిల్లా వంతాడ గ్రామంలో ఘటన
- మైనింగ్ ప్రాంత సందర్శనకు పవన్ యత్నం
- రాకను అడ్డుకుంటూ రోడ్డును బ్లాక్ చేసిన వ్యక్తులు
ఈ సందర్భంగా పవన్ రాకను అడ్డుకునేందుకు కొందరు వ్యక్తులు రోడ్డుపై భారీగా మట్టిని పోసి మార్గాన్ని బ్లాక్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన అధినేత, కాలినడకన వెళ్లి గిరిజనులను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. వేల కోట్ల దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే తన పర్యటనను అడ్డుకునేందుకు రోడ్డును బ్లాక్ చేశారని మండిపడ్డారు.
గిరిజనుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెబుతున్న చంద్రబాబుకు ఇది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి మైనింగ్ మాఫియా కారణంగా ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వంతాడ గ్రామంలో గిరిజనులకు న్యాయం జరిగేవరకూ జనసేన పోరాడుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.