Andhra Pradesh: తిత్లీ బాధితులకు ఊరట.. నేడు భారీగా నష్టపరిహారాన్ని అందించనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్!

  • రికార్డు స్థాయిలో 24 రోజుల్లోనే సాయం
  • మరికాసేపట్లో శ్రీకాకుళంలో పర్యటన
  • పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు

తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దీని దెబ్బకు వేలాది ఎకరాల్లో పంట నాశనం కాగా, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలామంది మత్స్యకారులు సర్వస్వం కోల్పోయారు. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో కేవలం 24 రోజుల్లోనే తుపాను బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమయింది.

ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు జిల్లాలోని మందసలో తుపాను బాధితులకు మంత్రి లోకేశ్ నష్ట పరిహారం చెక్కులను అందజేయనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పలాస రైల్వే మైదానంలో సీఎం చంద్రబాబు, లోకేశ్ బాధితులకు చెక్కులను అందజేస్తారు. మొత్తం 19 మండలాల్లో దాదాపు 4.6 లక్షల మందికి రూ.530 కోట్ల భారీ పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం ఈ సందర్భంగా చెల్లించనుంది. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.

More Telugu News