Jagan: జగన్ పై హత్యాయత్నాన్ని ఎవరో చేయించారు: శ్రీనివాసరావు సోదరి

  • జగన్ పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు
  • ఎవరో డబ్బులిస్తామని చెప్పుంటారంటున్న రత్నకుమారి
  • వారి పేరు చెబితే చంపేస్తారేమోనని అనుమానం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై తన తమ్ముడితో ఎవరో హత్యాయత్నం చేయించారని జనిపల్లి శ్రీనివాసరావు సోదరి రత్నకుమారి వ్యాఖ్యానించింది. వారి పేరు చెబితే హత్య చేస్తామని తన తమ్ముడిని భయపెట్టి వుండవచ్చని, అందువల్లే అతను వారి పేరు చెప్పడం లేదన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన ఆమె, వాళ్లేదో డబ్బు ఆశ పెట్టి వుండవచ్చని, ఆ డబ్బుతోనే శ్రీనివాస్ భూమిని కొనుగోలు చేయాలని భావించివుండవచ్చని తెలిపింది. ఇప్పుడు వాళ్లు డబ్బులేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, తన తమ్ముడు బలైపోయాడని వాపోయింది.

తమ తమ్ముడి చేతిలో రూపాయి కూడా లేదని, అతను ఇంత దారుణం చేస్తాడని తాము ఊహించలేదని రత్నకుమారి వ్యాఖ్యానించింది. ఈ పని చేయించిన వారు తమ తమ్ముడిని చంపేస్తారన్న భయం ఇంట్లోని అందరిలోనూ నెలకొని వుందని, ఎవరో చేయించిన పనికి తన తమ్ముడు బలయ్యాడని తెలిపింది. అసలు శ్రీనివాస్, 9 ఫోన్లను మార్చాడంటేనే నమ్మశక్యం కావడం లేదని, ఎప్పుడూ తన వద్దకు వచ్చి, పెట్రోలు కోసం రూ. 20 , రూ. 30 అడిగి తీసుకు వెళ్లేవాడని చెప్పింది. తాము మొత్తం ఆరుగురమని, ఆరుగురిలో ఒకడు పోయినట్టే అనిపిస్తోందని, ఇక వాడు తిరిగి వస్తాడో, రాడోనన్న ఆందోళనను వ్యక్తం చేసింది.
Jagan
Murder Attempt
Srinivasa Rao
Ratna Kumari

More Telugu News