Kerala: రేపు ఒక్క రోజే తెరచుకోనున్న అయ్యప్ప ఆలయం... సిద్ధమవుతున్న యువతులు... రెడీ అంటున్న భక్తులు!

  • మాస పూజల నిమిత్తం తెరచుకోనున్న దేవాలయం
  • సుమారు 80 మంది మహిళలు సిద్ధం
  • పంబ నుంచి ఆలయం వరకూ 144 సెక్షన్

రేపు మాసపూజల కోసం శబరిమలలోని అయ్యప్ప ఆలయం కొన్ని గంటల పాటు తెరచుకోనుండగా, ఇప్పటికే ఆ ప్రాంతమంతా పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయింది. రేపు 9 గంటల పాటు ఆలయాన్ని తెరచివుంచనుండగా, సుప్రీంకోర్టు తీర్పు మేరకు స్వామిని దర్శించుకునేందుకు 10 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న దాదాపు 70 నుంచి 80 మంది ఇప్పటికే కొండకు బయలుదేరినట్టు తెలుస్తుండటంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఆలయంతో పాటు పంబా నది నుంచి నీలక్కల్ వరకూ వెళ్లే మార్గాలను తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, భక్తులను కూడా నియంత్రిస్తున్నారు.

ప్రత్యేక పూజల నిమిత్తం అయ్యప్ప ఆలయం తెరచుకోనుండగా, తాము కూడా వెళ్లి దర్శనం చేసుకుంటామని కొందరు మహిళలు ఇప్పటికే సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టడంతో, కేరళ ఉద్రిక్తంగా మారింది. ఒక రోజు ఉత్సవం కోసం ఆలయం తెరచుకోనుండగా, సుమారు 5 వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మహిళలు ఎవరైనా వస్తే, వారిని సాధారణ నడకదారి మార్గంలో కాకుండా, ట్రాక్టర్లు, తదితర వాహనాలు వెళ్లే రోడ్డు మార్గం గుండా పైకి తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

మొత్తం ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు, భక్తులు గుమిగూడి వుంటే అరెస్ట్ తప్పదని హెచ్చరిస్తుండగా, మహిళలు ఎవరైనా వస్తే అడ్డుకుని తీరుతామని భక్తులు అంతే దీటుగా చెబుతున్న పరిస్థితి. ఆలయ పరిసరాల్లో పరిస్థితిపై సమీక్షించిన కేరళ సర్కారు, మాసపూజల రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా ఏర్పాట్లు చేశామని, సుప్రీంకోర్టు తీర్పును అందరూ గౌరవించాలని పేర్కొంది. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

More Telugu News