Pawan Kalyan: మిస్టర్ రాహుల్ గాంధీ.. తెలంగాణ నేతలు ఆంధ్రులను దశాబ్ద కాలంపైగా నానా మాటలు అన్నారు: పవన్ కల్యాణ్

  • రాహుల్ గాంధీకి సోషల్ మీడియా ద్వారా లేఖను సంధించిన పవన్
  • చేయని తప్పుకు ఆంధ్ర ప్రజలు బలయ్యారంటూ ఆవేదన
  • అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహించవద్దని విన్నపం

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సోషల్ మీడియా ద్వారా జనసేనాని పవన్ కల్యాణ్ ఓ బహిరంగ లేఖ రాశారు. లేఖలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. లేఖ సారాంశం ఇదే.

'మిస్టర్ రాహుల్ గాంధీ, మీ ముందు తరం వ్యక్తుల్లా మీరు కూడా వ్యవహరించకండి. మీ సీనియర్ నేతలు, వారి అనుభవం ఉమ్మడి తెలుగు రాష్ట్రం అస్తవ్యస్తంగా విడిపోవడానికి కారణమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు 2014లో ఆంధ్రప్రదేశ్ ను అప్రజాస్వామికంగా విడదీశాయి. మీ చర్యలతో మేమంతా ఎంతో ఆవేదనకు, బాధకు గురయ్యాము.
దశాబ్ద కాలానికి పైగా సొంత దేశంలోనే ఏపీ ప్రజలంతా రెండో తరగతి పౌరులుగా పరిగణించబడ్డారు. తెలంగాణ నేతలు ఆంధ్రులను దశాబ్ద కాలంపైగా నానా మాటలు అన్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన నేతల నిర్ణయాల వల్ల తెలంగాణకు కొంత అన్యాయం జరిగి ఉండవచ్చు... దానికి ఆంధ్ర ప్రజలు ఎలా బాధ్యులవుతారు?

రాష్ట్ర విభజనలో అత్యంత దారుణమైన ఎపిసోడ్ ఏమిటంటే... రాజకీయవేత్తలుగా మారిన ఏపీ వ్యాపారవేత్తలు వారి అవసరాలకు అనుగుణంగా వ్యవహరించారు. వారి కాంట్రాక్టులు, పదవులను పదిలంగా ఉంచుకునేందుకే యత్నించారు. రాష్ట్ర విభజన ఎపిసోడ్ లో వారే అసలైన ముద్దాయిలు.

చేయని తప్పుకు ఏపీ ప్రజలు బాధలు అనుభవిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న లబ్ధిని కోల్పోయారు. ఉదాహరణకు... తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఓ జీవోతో... ఏపీలో బీసీలుగా ఉన్నవారు తెలంగాణలో బీసీ హోదాను కోల్పోయారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో. ఏపీ ఎంపీలపై బీజేపీ, కాంగ్రెస్ లు ఏ విధంగా దాడి చేశాయో... పార్లమెంటు నుంచి ఎలా గెంటేశాయో మేము మర్చిపోలేం.

2014లో గాంధీనగర్ లో అప్పటి గుజరాత్ సీఎం అయిన ప్రస్తుత ప్రధాని మోదీని కలిశాను. రాజ్యాంగ స్పూర్తిని రాజకీయ నాయకులు కొనసాగించలేనప్పుడు, వారి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను పట్టించుకోకుండా, బాధకు గురిచేసినప్పుడు... విభజన పోరాటాలు పుట్టుకొస్తాయని అప్పుడు మోదీకి చెప్పాను.

మిస్టర్ రాహుల్ గాంధీ, విభజన పోరాటాలు అప్పటికప్పుడు కళ్లకు కనిపించవు. సమకాలీన భారతావనిలో మీరొక కీలక నేత. అవకాశవాద రాజకీయాలను దయచేసి ప్రోత్సహించవద్దు. ఒకవేళ మీరు అదే చేస్తే... మీకు, మీ ముందు తరాలకు తేడా లేనట్టే.'

More Telugu News