Narendra Modi: రాష్ట్రానికి, దేశానికి పట్టిన దెయ్యం ప్రధాని మోదీ: డొక్కా మాణిక్యవరప్రసాద్

  • మోదీ విధానాల వల్ల రాష్ట్రం, దేశం అధోగతి
  • రాష్ట్రానికి రావలసిన నిధులు రాకుండా మోదీ చేస్తున్నారు
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో చంద్రబాబు కీలక భూమిక పోషిస్తున్నారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రాష్ట్రానికి, దేశానికి పట్టిన దెయ్యంగా ఏపీ శాసన మండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. మోదీ అనుసరించే విధానాల వల్ల రాష్ట్రం, దేశం అధోగతి పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన పెద్దలు పోరాడి సాధించిన స్వాతంత్ర్యానికి, ప్రజాస్వామ్యానికి అమిత్ షా, మోదీ కలిసి విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులలో రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు.

ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం ఎన్టీఆర్ ముందుకొచ్చారని గుర్తు చేశారు. ఈ నాడు ఏపీకి జరుగుతున్న అన్యాయానికి, మోదీ పాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు ముందుకొచ్చారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగితే ఎంత దురుసుగా సమాధానం చెప్పారో అందరికీ తెలుసన్నారు. సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసే విధంగా రాష్ట్రానికి రావలసిన నిధులు రాకుండా చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్ట్, నూతన రాజధాని అమరావతి నిర్మాణాలకు ఆటంకాలు కల్పిస్తున్నారన్నారు.

జడ్జీల వివాదం, సీబీఐ అధికారుల వివాదం, రిజర్వు బ్యాంకు సంక్షోభం, పత్రికా స్వేచ్ఛపై దాడి లాంటివి అనేకం మోదీ హయాంలో జరుగుతున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితులలో నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఆత్మాభిమానం కోసం నిలిచే చంద్రబాబు నాయకత్వం దేశానికి మార్గదర్శకత్వంగా నిలుస్తుందన్నారు. మోదీ మళ్లీ రాకుండా, దేశానికి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో దేశభక్తి కలిగిన నాయకునిగా, దేశాన్ని రక్షించవలసిన బాధ్యతతో ముందుకు వెళుతున్నట్లు మాణిక్యవరప్రసాద్ చెప్పారు.

More Telugu News