jalagam prasadarao: కాంగ్రెస్‌కు జలగం ప్రసాదరావు షాక్‌ ...తెరాసలో చేరాలని నిర్ణయం

  • నిషేధం ఎత్తివేసినా మనసు మార్చుకోని మాజీ సీఎం కొడుకు
  • శనివారం కేసీఆర్‌ సమక్షంలో ఆ పార్టీ తీర్థం
  • 1999లో అధిష్ఠానం సస్పెండ్‌ చేయడంతో క్రియాశీలక రాజకీయాలకు దూరం

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ శాఖ మాజీ మంత్రి జలగం ప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ 1999లో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖమ్మం జిల్లాకు చెందిన జలగం ప్రసాదరావుపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ప్రసాదరావు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు వెలువడ్డాయి.

అయితే తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను కొందరు కాంగ్రెస్‌ పెద్దలు అడ్డుకుంటున్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో ప్రసాదరావు కారెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తేలింది. ఇది తెలిసి అప్రమత్తమైన కాంగ్రెస్‌ అధిష్ఠానం హడావుడిగా ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అయినప్పటికీ తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించి అధిష్ఠానానికి షాకిచ్చారు. ప్రసాదరావు శనివారం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.

More Telugu News