February: 9,796 టికెట్లు అదృష్ట భక్తులకే... ఫిబ్రవరి శ్రీవారి సేవా టికెట్లు విడుదల!

  • ఫిబ్రవరి నెల కోటా విడుదల
  • సోమవారం వరకూ రిజిస్ట్రేషన్ సమయం
  • సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్

ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీనివాసుని ఆర్జిత సేవలకు సంబంధించిన మొత్తం 67,146 టికెట్లను టీటీడీ కొద్దిసేపటి క్రితం ఆన్ లైన్లో విడుదల చేసింది. వీటిల్లో 9,796 టికెట్లను ఆన్ లైన్ డిప్ విధానంలో భక్తులకు అందించనున్నట్టు అధికారులు వెల్లడించారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాదదర్శనం టికెట్లు కోరే భక్తులు, శుక్రవారం నుంచి సోమవారం వరకూ రిజిస్టర్ చేసుకోవచ్చని, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్ తీసి టికెట్లు పొందిన భక్తుల పేర్లను వెల్లడిస్తామని పేర్కొంది. ఆపై రెండు రోజుల్లోగా వారు నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. 7,096 సుప్రభాతం, 110 చొప్పున తోమాల, అర్చన టికెట్లు, 180 అష్టదళ పాదపద్మారాధన, 2,300 నిజపాద దర్శనం టికెట్లను డిప్ తీయనున్నట్టు వెల్లడించింది.

ఇదే సమయంలో సాధారణ ఆన్ లైన్ బుకింగ్ విధానం ద్వారా 57,350 టికెట్లను విడుదల చేసినట్టు టీటీడీ పేర్కొంది. వీటిల్లో విశేష పూజకు 2,000, కల్యాణోత్సవం 12,825, ఊంజల్ సేవ 4,050, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,425, సహస్ర దీపాలంకార సేవ 16,200, వసంతోత్సవం 14,850 టికెట్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపింది.

More Telugu News