Andhra Pradesh: చంద్రబాబుకు ప్రధాని పదవి మీద ఆశ లేదు.. ఏపీ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం!: మంత్రి అచ్చెన్నాయుడు

  • హోదా ఇస్తామని రాహుల్ ఇప్పటికే ప్రకటించారు
  • బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్ తో కలుస్తున్నాం
  • ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారు

కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం టీడీపీ కూటమిని ఏర్పాటు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడంలో భాగంగానే రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ కానున్నట్లు వెల్లడించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసమే తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరామనీ, కానీ కేంద్ర ప్రభుత్వం మోసం చేయడంతో బయటకు వచ్చామని పేర్కొన్నారు. అమరావతిలో ఈ రోజు ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని పదవిని ఆశించడం లేదనీ, రాష్ట్ర ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాతో పాటు విభజనహామీలు అమలు చేస్తామని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారనీ, హోదా వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

More Telugu News