CBI: రాకేష్ అస్థానా పిటిషన్‌పై సీబీఐ తీవ్ర అభ్యంతరం

  • ఎఫ్ఐఆర్ లేకుండా దర్యాప్తు కుదరదు..
  • దర్యాప్తు తొలిదశలోనే ఉంది
  • కోర్టుకు వెల్లడించిన సీబీఐ

తనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానా ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌‌పై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌‌ అస్థానాపై అవినీతి ఆరోపణలతో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తే ఆయనపై కేసు పెట్టదగిన నేరారోపణలు ఉన్నట్లు తెలుస్తోందని ఢిల్లీ కోర్టుకు సీబీఐ వెల్లడించింది. కేసు ప్రస్తుతం ఉన్న దశలో ఎఫ్‌ఐఆర్‌ లేకుండా దర్యాప్తు చేయడానికి అనుమతి ఉండదని తెలిపింది.

ప్రస్తుతం అస్థానాపై దర్యాప్తు తొలి దశలోనే ఉందని, కేసులో పలు పత్రాల గురించి, ఇతర వ్యక్తుల పాత్ర గురించి విచారణ జరపుతున్నామని స్పష్టం చేసింది. ఈ కేసులో పలు పత్రాలు, దస్త్రాలు కేంద్ర విజిలెన్స్ కమిషన్ పరిశీలనలో ఉండడం వల్ల పూర్తి సమాచారం తమ వద్ద లేకపోవడం ఇబ్బందిగా మారిందని కోర్టుకు సీబీఐ తెలిపింది.

ఇదిలావుండా సీబీఐ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్ మధ్య జరిగిన అంతర్గత కుమ్ములాటల అనంతర పరిణామాలతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ అస్థానాల అవినీతి ఆరోపణలపై విచారణ సజావుగా సాగేందుకు ఇరువురినీ కేంద్ర ప్రభుత్వం సెలవుపై పంపించింది. అస్థానా లంచాలు తీసుకున్నాడని ఆరోపిస్తూ సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన అలోక్‌ వర్మ ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి విచారణ కూడా ప్రారంభించారు. దీంతో అస్థానా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

More Telugu News