chandrababu: సీనియర్ నాయకులుగా మేమంతా ఆందోళన చెందుతున్నాం!: చంద్రబాబు

  • దేశంలోనే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాలు సీనియర్ నేతలు
  • దేశ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి
  • భవిష్యత్ తరాలను రక్షించడానికి పూనుకున్నాం

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు దిశగా కార్యాచరణను మొదలు పెట్టారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం శరద్ పవార్ నివాసంలో కొనసాగింది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలోనే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా సీనియర్ నేతలని చెప్పారు. బీజేపీ పాలనలో దేశ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని, కీలకమైన వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని విమర్శించారు. సీనియర్ నేతలుగా తామంతా ఆందోళన చెందుతున్నామని చెప్పారు.

 భవిష్యత్ తరాలను, దేశాన్ని రక్షించడానికి తాము పూనుకున్నామని తెలిపారు. అందరం కలసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. శరద్ పవార్ మాట్లాడుతూ, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'సేవ్ కంట్రీ, సేవ్ డెమోక్రసీ' పేరుతో తామంతా ముందుకు సాగుతున్నామని చెప్పారు. భావసారూప్యం ఉన్న పార్టీలన్నీ తమతో కలసి రావాలని కోరుతున్నామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలసి పోరాడాలని పిలుపునిచ్చారు.ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ, సీబీఐ, ఆర్బీఐలలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసని... దీనిపై తాము చర్చించామని తెలిపారు. రానున్న ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించామని వెల్లడించారు. దేశ భవిష్యత్తు కోసం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

More Telugu News