Rahul Gandhi: రేపు రాహుల్ ని కూడా కలిసి మాట్లాడతా.. అందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తా: సీఎం చంద్రబాబు

  • ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ భ్రష్టుపట్టిస్తోంది
  • దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
  • అందరితో కలిసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతాం

ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ భ్రష్టుపట్టిస్తోందని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తన సభ్యత్వాన్ని చంద్రబాబు పునరుద్ధరించుకున్నారు. కోటి సభ్యత్వాలే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం టీడీపీకి 71 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీ అనేది పెద్ద కుటుంబ వ్యవస్థ అని,  కార్యకర్తల బాగోగులు చూడటం టీడీపీ కర్తవ్యమని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా 71 లక్షల సభ్యత్వాలు ఉన్న పార్టీ టీడీపీ అని, కార్యకర్తలకు బీమా కింద రూ.58.44 కోట్లు చెల్లించామని అన్నారు.

ప్రమాదంలో పడిన ప్రజాస్వామాన్ని కాపాడుకోవడానికే తన ప్రయత్నమని, రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తానని ప్రకటించారు. రాహుల్ తో కూడా మాట్లాడి అందరినీ ఒకే తాటిపైకి తీసుకువస్తానని అన్నారు. అందరితో కలిసి జాతీయస్థాయిలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని అన్నారు. మోదీ, అమిత్ షాలకు భయపడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. దేశానికి ఎన్నోసార్లు టీడీపీ దశాదిశా చూపిందని, మరోసారి, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ప్రధాన మంత్రి పదవి చేపట్టాలని 1995లోనే తనపై ఒత్తిడి వచ్చిందని, రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినన్పటికీ సున్నితంగా తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు.

More Telugu News