ys jagan: దాడి కేసు... హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన జగన్

  • ఈ కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదు
  • సక్రమంగా విచారణ జరపడంలో ప్రభుత్వం విఫలమైంది
  • ‘ఆపరేషన్ గరుడ’తో ఓ కొత్త నాటకం

వైసీపీ అధినేత జగన్ తనపై జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. సక్రమంగా విచారణ జరపడంలో ప్రభుత్వం విఫలమైందని, కుట్ర కోణాన్ని సజావుగా దర్యాప్తు చేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఏపీలో పాదయాత్ర చేస్తున్నానని, ప్రభుత్వ తప్పిదాలను, పాలకుల అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు సర్కారు, టీడీపీ దుర్మార్గాలపై ఎప్పటికప్పుడు ఎండగడుతున్నా ఆపరేషన్ గరుడ పేరిట ఓ కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం పడగొట్టే ప్లాన్ అని చెబుతున్నారని, టీడీపీ సానుభూతిపరుడే ‘ఆపరేషన్ గరుడ’ పాత్రధారి అని, అతను నటుడు శివాజీ  అని ఆరోపించారు. పాదయాత్రలో తనపై ఓ దాడి చేస్తారని, టీడీపీ ప్రభుత్వ పతనానికి ఆ సంఘటన దారితీస్తుందని నటుడు శివాజీ గతంలో చెప్పిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఇదో భారీ కుట్ర అని అర్థమవుతోందని, ప్రతిపక్ష నేతను హత్య చేసి ‘ఆపరేషన్ గరుడ’లో భాగమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

అక్టోబర్ 25న ఇద్దరు భద్రతా సిబ్బందితో విశాఖ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన తాను, అక్కడి లాంజ్ లో కూర్చుని ఉండగా రెస్టారెంట్ లో పనిచేసే వ్యక్తి  సెల్ఫీ తీసుకుంటానంటూ తన వద్దకు వచ్చి తనపై దాడి చేయబోయాడని జగన్ పేర్కొన్నారు. పదునైన కత్తితో తనపై దాడి చేయబోతే, తాను తృటిలో తప్పించుకున్నానని, కిందకు వంగడంతో గొంతుకు తగలాల్సిన కత్తి భుజంలో గుచ్చుకుందని జగన్ వివరించారు. దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారని, ప్రాథమిక చికిత్స అనంతరం తాను హైదరాబాద్ కు వచ్చానని, సిటీ న్యూరో ఆసుపత్రిలో తనకు చికిత్స చేసి 9 కుట్లు వేశారని తెలిపారు.

తనపై దాడి జరిగిన గంటలోనే ఏపీ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టారని, పబ్లిసిటీ కోసం జరిగిన దాడి అంటూ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని జగన్ తన పిటిషన్ లో ఆరోపించారు. సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ‘ఇదంతా ఆపరేషన్ గరుడ’లో భాగం’ అని పేర్కొన్నారని, దాడి చాలా చిన్నవిషయమని ఆ ప్రెస్ మీట్ లో సీఎం చెప్పారని, ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. గాయం చాలా చిన్నదంటూ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారని, పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం ఇది హత్యాయత్నం అని పేర్కొన్నారని ఆ పిటిషన్ లో జగన్ తెలిపారు.

వేర్వేరు హ్యాండ్ రైటింగ్స్ తో ఉన్న పది పేజీల లేఖను విడుదల చేశారని, దాడి ఘటన జరిగిన గంటలోనే ఓ ఫ్లెక్సీని తెరపైకి తెచ్చారని, నిందితుడు వైసీపీ అభిమాని అంటూ నమ్మించే ప్రయత్నం చేశారని, జరిగిన హత్యాయత్నాన్ని కప్పిపుచ్చేలా సీఎం, డీజీపీలు ప్రకటనలు చేశారని, ఏపీ పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని, తన ప్రాథమికహక్కులకు భంగం వాటిల్లేలా విచారణ సాగుతోందని,  ఏపీ ప్రభుత్వానికి సంబంధంలేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని ఆ రిట్ పిటిషన్ లో హైకోర్టును జగన్ కోరారు.

More Telugu News