Telangana: ‘మహాకూటమి’ మేము అనుకున్న లైనులో నడవడం లేదు.. ఆరు సీట్లు ఇవ్వకుంటే కష్టమే!: సీపీఐ నేత చాడ

  • ఈ రోజు చాడ నివాసంలో నేతల భేటీ
  • పోటీ చేయాల్సిన స్థానాలపై చర్చ
  • జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తున్న సీపీఐ

తెలంగాణ ఎన్నికల కోసం ఏర్పాటైన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కోసం నేతలు ఈ రోజు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి నివాసంలో సమావేశం అయ్యారు. టీడీపీ తెలంగాణ చీఫ్ ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఈ సదస్సులో పాల్గొన్నారు. గత కొద్దిరోజులుగా మహాకూటమిలో సీట్ల పంపిణీ, పోటీ చేయాల్సిన స్థానాలపై నేతల మధ్య ఓ అంగీకారం రావడం లేదు.

ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని దేవరకొండ, ఖమ్మం జిల్లాలో వైరా, కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు స్థానాలను సీపీఐ ఆశిస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఈ సీట్లలో సీపీఐ ఓడిపోయిన నేపథ్యంలో వీటిని కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరిస్తోంది.

మరోవైపు గెలిచే స్థానాలను వదులుకోవద్దని టీకాంగ్రెస్ నేతలకు సీనియర్లు, హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో పరిస్థితి జటిలంగా మారుతోంది. మహాకూటమి తరఫున ఏ పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే ఎవరెవరు, ఎక్కడి నుంచి పోటీచేయాలన్న విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో మహాకూటమి సమావేశం అనంతరం చాడ మాట్లాడుతూ.. తాము అనుకున్న లైన్లో కూటమి నడవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 6 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే కూటమిలో కొనసాగుతామని స్పష్టం చేశామన్నారు. ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలపైనే ఉందని తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News