Andhra Pradesh: తెలంగాణ ఎన్నికల కోసం మా ఇంటెలిజెన్స్ డబ్బులు పంచలేదు.. రహస్య సమాచారం కోసమే వెళ్లాం!: ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్

  • ఇంటెలిజెన్స్ దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు
  • మావాళ్లు తప్పుచేయలేదని తెలంగాణ పోలీసులే తేల్చారు
  • ఎన్నికల సంఘానికి ఏపీ డీజీపీ జవాబు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు మహాకూటమి నేతల కోసం డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలను ఆంధ్రా డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు. తెలంగాణ పోలీసులు పట్టుకున్న ముగ్గురు తమ సిబ్బందేననీ, వాళ్లంతా మావోయిస్టుల గురించి సమాచార సేకరణకు వెళ్లారని తెలిపారు. ఇంటెలిజెన్స్ అధికారులు దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చన్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధానేనని గుర్తుచేశారు.

ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ముగ్గురు పోలీసులు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో డబ్బు పంచుతున్నారని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల టీ-సీఈవో రజత్‌ కుమార్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా రజత్ కుమార్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ తాజాగా సమాధానమిచ్చారు. హైదరాబాద్ లో ఏపీకి చెందిన పలువురు వీఐపీలతో పాటు ఆస్తులు ఉన్నాయని ఠాకూర్ లేఖలో తెలిపారు.

ఈ నేపథ్యంలో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంపై తాము నిఘా పెట్టామని వెల్లడించారు. ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లాలో పర్యటించామని పేర్కొన్నారు. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇంటలిజెన్స్ విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రహస్య సమాచార సేకరణ కోసం దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు రాష్ట్రాల పోలీసులకు ఉంటుందన్నారు. తెలంగాణ ఎన్నికల కోసం డబ్బులు పంచుతున్నట్లు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ విషయంలో విచారణ జరిపిన తెలంగాణ పోలీసులు కూడా తమ అధికారులు తప్పేమీ చేయలేదని చెప్పారన్నారు.

More Telugu News