Telangana: పటేల్ చొరవ చూపకుంటే హైదరాబాద్ కు వీసాపై వెళ్లాల్సి వచ్చేది!: ప్రధాని మోదీ

  • గిర్ సింహాలను చూడాలన్నా వీసా కావాల్సి వచ్చేది
  • సివిల్స్ సంస్కరణలను పటేల్ చేపట్టారు
  • అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలను గాడిలో పెట్టారు

భారత తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ చొరవ చూపకుంటే గుజరాత్ లోని గిర్ సింహాలను చూడటానికి, సోమనాథ్ ఆలయాన్ని, హైదరాబాద్ లోని చార్మినార్ ను సందర్శించడానికి కూడా భారతీయులు వీసా తీసుకోవాల్సి వచ్చేదని ప్రధాని మోదీ అన్నారు. పటేల్ దూరదృష్టి, తెలివితేటల కారణంగానే దేశంలో 562 స్వదేశీ సంస్థానాలను విలీనం చేయగలిగారని తెలిపారు. ఈ రోజు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో ఏర్పాటు చేసిన పటేల్ విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం మోదీ ప్రసంగించారు.

సర్దార్ పటేల్ పనిచేయకుంటే సివిల్ సర్వీస్ లో సంస్కరణలు ఉండేవి కాదనీ, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సరిగ్గా రైల్వే లైన్ కూడా ఉండేది కాదని వ్యాఖ్యానించారు. పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇండియన్ సివిల్ సర్వీస్(ఐసీఎస్)లో స్వాతంత్ర్యం తర్వాత తొలి హోంమంత్రి పటేల్ సంస్కరణలు చేపట్టారని వెల్లడించారు.

దేశవిభజన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న పోలీస్, ఇతర కేంద్ర సర్వీసులను పటేల్ గాడిలో పెట్టారన్నారు. అంతేకాకుండా పంచాయితీ ఎన్నికల్లో మహిళలు పోటీచేసేలా పటేల్ చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

More Telugu News