Gujarath: గుజరాత్ లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఆవిష్కరించిన మోదీ.. ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంగా రికార్డు!

  • అహ్మాబాద్ లోని సరోవర్ డ్యామ్ వద్ద ఏర్పాటు
  • 2013, అక్టోబర్ 31న శంకుస్థాపన చేసిన మోదీ
  • పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్లాన్

భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఆవిష్కరించారు. సర్దార్ పటేల్ 143వ జయంతి సందర్భంగా నేడు ఈ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ కు మోదీ నివాళులు అర్పించారు. నర్మదా జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో సాధు బెట్‌లో ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ని నిర్మించారు. 2013 అక్టోబర్‌ 31 గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో మోదీ ఈ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.


దాదాపు 182 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా రికార్డు సృష్టించింది. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఇది రెట్టింపు ఎత్తులో ఉంటుంది. ఈ భారీ విగ్రహాన్ని ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సరోవర్ డ్యామ్ తో పాటు చుట్టుపక్కల ప్రకృతిని ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.

దాదాపు 30 నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో పటేల్ విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో 37 మంది పటేల్ కుటుంబీకులు పాల్గొన్నారు. పటేల్‌ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు ఆందోళన చేపట్టారు.

More Telugu News