CM Ramesh: నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక... నా భార్యపై దాడికి యత్నించారు: సీఎం రమేష్

  • నన్నో దేశద్రోహిగా చిత్రించాలనుకున్నారు
  • ఇన్‌కంటాక్స్, మా ఇంటిపై దాడులు చేశారు
  •  సీబీఐ కేసుల్లో ఇరికించాలని చూశారు
  • వీటన్నీటికి కారణం జగన్.. బీజేపీ కాళ్లపై పడటమే

తనపై దాడి చేసే ధైర్యంలేక బీజేపీ తన భార్యపై దాడికి ప్రయత్నించిందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మంగళవారం కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాజ్యసభలో ఒక పీఏసీ ఎలక్షన్ జరిగితే టీడీపీ తరుఫున నేను, బీజేపీ తరుఫున వాళ్లు నిలబడితే వారికి కేవలం 69 ఓట్లు, నాకు 111 ఓట్లు వచ్చాయి. అన్ని పార్టీలు కలిసి బీజేపీని పక్కనబెట్టి టీడీపీని గెలిపించేందుకు ఓటేశాయి. ఆ రోజు నుంచే కక్ష గట్టారు. ఆరోజే అమిత్ షా బెదిరించారు. ‘మాకు ఎదురుగా వచ్చి పోటీ చేసి గెలుస్తావా? నిన్నేం చేస్తామో చూడు’ అన్నారు. ఆ కారణంగానే నన్నో దేశద్రోహిగా చిత్రించాలనుకున్నారు. ఇన్‌కంటాక్స్ దాడి, మా ఇంటిపై దాడి, నాపై దాడి చేసే ధైర్యం లేక నా భార్యపై దాడికి ప్రయత్నించారు.

దాడుల అనంతరం పంచనామాతో సహా మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టా. దాని తర్వాత నన్ను సీబీఐ కేసుల్లో ఇరికించాలని చూశారు. రేపు పాకిస్తాన్‌లో ఎవరైనా మిలిటెంట్ దొరికితే ఇతనికి సీఎం రమేష్‌కూ సంబంధాలున్నాయని లేదంటే టీడీపీకి సంబంధాలున్నాయని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వీటన్నింటికీ కారణం మన జిల్లా వాసి జగన్ కేసులకు భయపడి వాళ్ల కాళ్ల దగ్గర ప్రాథేయపడుతూ కడప జిల్లా పౌరుషానికే ద్రోహం చేశాడు. ఇటువంటి వారిని ఏం చేయాలి? రాం మాధవ్, జీవీఎల్ వంటి వారిని రాష్ట్రానికి పంపించి ప్రజల్లో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. ఈ పచ్చజెండా మాపై ఉన్నంత వరకూ మమ్మల్నేం చేయలేరు. కడప జిల్లాలో పుట్టిన బిడ్డగా ఎవ్వరికీ భయపడేది లేదు’’ అని తెలిపారు.

More Telugu News