kotamreddy sridhar reddy: కోడి కత్తి డ్రామా అన్నారు.. రిమాండ్ రిపోర్టుపై ఏం చెబుతారు?: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  • రిమాండ్ రిపోర్టు వైఎస్సార్‌సీపీ రాయలేదు
  • మానవత్వం లేకుండా టీడీపీ నేతలు మాట్లాడారు
  • ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది?

వైజాగ్ విమానాశ్రయంలో జరిగిన దాడిలో గాయపడ్డ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన నివాసానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ చేతికి వాపు వచ్చిందని చెప్పారు. ఈ కారణంగా ఈ రోజు ఆయనను కలవలేకపోయామని అన్నారు. కొన్నిరోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని, దీంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.
 
జగన్‌పై దాడి జరిగిన రోజు నుంచి టీడీపీ నేతలే రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం పెట్టి పచ్చి అసత్యాలు చెప్పారని విమర్శించారు. జగన్‌ను ఏకవచనంతో సంబోధించారని, విచారణ పూర్తయినట్లే మంత్రులు మాట్లాడారని, విచారణపై ఇంకెందుకు నమ్మకం వస్తుందని, రిమాండ్ రిపోర్టుపై ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు.

రిమాండ్ రిపోర్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాసే రిపోర్టు కాదని, తెలంగాణ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం రాసే రిపోర్టు అనతకన్నా కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులే రిమాండ్ రిపోర్టు రాశారని, రిపోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, తృటిలో తప్పించుకున్నారని స్పష్టంగా తేలిందన్నారు. నిందితుడు అనుకున్న చోట పొడిచే ఉంటే ప్రమాదం జరిగివుండేదని రిమాండ్ రిపోర్టులో వెల్లడైందన్నారు.

గత నాలుగు రోజులుగా తెలుగుదేశం నేతలు, మంత్రులు మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఏం సంబంధం లేకపోతే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందన్నారు. కోడి కత్తి డ్రామా అంటున్నారు కదా.. ఈ కోడి కత్తి గాయానికి టీడీపీ నేతలు సిద్ధంగా ఉంటారా? అని ప్రశ్నించారు. మానవత్వం లేకుండా కోడి కత్తి డ్రామా అంటున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News