TRS: ఏం చేశావని మళ్లీ వచ్చావ్.. నీకు ఓటెందుకు వేయాలి?: టీఆర్ఎస్ నేత రాజయ్యకు రైతుల షాక్

  • నాలుగేళ్లుగా సాగునీరు లేక అల్లాడిపోతున్నాం
  • ఎన్నికలు రాగానే వస్తున్నారా
  • మాజీ ఎమ్మెల్యేపై మండిపడ్డ రైతులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నాయకులకు ప్రజలు చుక్కలు చూపుతున్నారు. ప్రచారానికి వెళ్లిన నేతలకు గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్యకు జనగామ జిల్లాలో చేదు అనుభవం ఎదురయింది. సాగునీటిని అందించకుండా నాలుగేళ్ల తర్వాత తీరిగ్గా వచ్చి ఓట్లు అడుగుతున్నవా? ఎందుకు వేయాలి? అని ఘాటుగా ప్రశ్నించాడు. దీంతో విస్తుపోవడం టీఆర్ఎస్ నేత వంతయింది.

జిల్లాలోని లింగాలఘణపురం మండలం జీడికల్‌ దేవాలయంలో రాజయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తా వద్దకు చేరుకున్న రాజయ్య అక్కడ చెట్లనీడన కూర్చున్న రైతుల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. దీంతో అక్కడ ఉన్న మద్దెబోయిన మల్లయ్య అనే రైతు రాజయ్యపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘ఇన్నాళ్లు ఏం చేశావని మళ్లీ ఓటేయమని వచ్చావు. మాకు నీళ్లు లేక మా చావు మేం సచ్చిపోతుంటే ఒక్కరోజయినా వచ్చి పట్టించుకున్నావా. చెరువుల్లో నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయ్‌.. నీళ్లు లేక అరిగోస పడుతున్నాం’ అని మండిపడ్డారు.

దీంతో షాక్ కు గురైన రాజయ్య అక్కడి నుంచి వెళ్లిపోయి ప్రచారరథంపైకి ఎక్కి ప్రసంగించారు. రైతు మల్లయ్య చెప్పిన దాంట్లో నిజముందని, అయితే గోదావరి కాలువ నిర్మాణాలు పూర్తి చేసి వీలైనంత తొందరగా చెరువులు నింపుతామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ రైతు మల్లయ్య శాంతించక పోవడంతో పోలీసులు ఆయనను పంపించారు. అనంతరం నాగారం గ్రామంలో ప్రసంగిస్తుండగా మరికొంత మంది రైతులు నిరసన వ్యక్తం చేశారు. గోదావరి జలాలతో చెరువులు నింపాలని రెండేళ్లుగా వేడుకున్నా ఇంతవరకు చుక్క నీళ్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News