Telangana: కొత్త ఓటర్ల జాబితాను నవంబర్ 19న విడుదల చేస్తాం: రజత్ కుమార్

  • ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ సంతృప్తి చెందింది
  • దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం
  • నవంబర్ 24 -26 తేదీల మధ్య పోలింగ్ కేంద్రాల పరిశీలన

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సిబ్బందికి విధులపై శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 12న ఓటర్ల జాబితా విడుదల చేశామని, 19వ తేదీ నాటికి అన్ని రకాల ఓటర్ల జాబితా ముద్రణ పూర్తయిందని వివరించారు. ఓటర్ల నమోదు కోసం ఇప్పటికీ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఓటర్ల జాబితా కొత్త ఎడిషన్ ను నవంబర్ 19న విడుదల చేస్తామని చెప్పారు.

పోలింగ్ సమయంలో దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, నవంబర్ 24 -26 తేదీల మధ్య పోలింగ్ కేంద్రాల పరిశీలన నిమిత్తం భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) బృందం వస్తుందని తెలిపారు. డబ్బు, మద్యం సరఫరా అరికట్టడంపై దృష్టి సారించామని, ఇప్పటి వరకూ రూ.31.41 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని, ఇప్పటికే 43 వేల మందిని బైండోవర్ చేశామని, ఎన్నికల విధుల నిమిత్తం 307 కంపెనీల బలగాలు కావాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులపై తమకు ఫిర్యాదు అందిందని, తెలంగాణలో వారు తిరగడంపై ఏపీ డీజీపీని వివరణ కోరామని రజత్ కుమార్ పేర్కొన్నారు.

More Telugu News