Andhra Pradesh: నటుడు శివాజీ చెప్పినట్లే జరుగుతోంది.. రేపో, మాపో నాపై కూడా ఐటీ దాడులు జరుగుతాయి!: సీఎం చంద్రబాబు

  • రూ.350 కోట్లను వెనక్కు తీసుకున్నారు
  • ప్రశ్నిస్తే ఐటీ దాడులు, కేసులతో వేధిస్తున్నారు
  • బీజేపీ ప్రభుత్వ వేధింపులకు లొంగబోం

నటుడు శివాజీ చెప్పినట్లే ‘ఆపరేషన్ గరుడ’ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో యోగేంద్ర యాదవ్, కర్ణాటకలో మంత్రి శివకుమార్ నివాసాలతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు సంబంధించి 19 చోట్ల దాడులు చేశారని చెప్పారు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలతోనే జరిగాయని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం చివరికి మీడియాను కూడా వదిలిపెట్టడం లేదనీ, ఎన్డీటీవీపై దాడులు నిర్వహించడం దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన రూ.350 కోట్లను చెప్పాపెట్టకుండా కేంద్రం వెనక్కు తీసుకుందని చంద్రబాబు అన్నారు. ఏపీలో టీడీపీ నేతలు, మద్దతుదారులను వేధించేందుకు ఆదాయపు పన్ను శాఖకు చెందిన 19 బృందాలను కేంద్రం పంపిందన్నారు. మోదీ మంత్రివర్గంలో ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు బయటకు రాగానే వేధింపులు ప్రారంభించారని చెప్పారు. విశాఖపట్నంలో ఫిన్ టెక్ సదస్సు జరుగుతుండగానే పారిశ్రామికవేత్తలను భయపెట్టేందుకు ఈ దాడులు సాగాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేయాలనుకునే బీజేపీ ప్రభుత్వం ఈ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్రం సాయం చేయకపోయినా ఆర్థిక ప్రగతి లో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరినైనా బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుందని స్పష్టం చేశారు. అందుకే మీడియా సైతం ధైర్యంగా రిపోర్ట్ చేయలేకపోతుందని వ్యాఖ్యానించారు. 1995లో సీఎంగా ఉన్న తాను టెక్నాలజీని ప్రమోట్ చేశానన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనీ, ప్రభుత్వ, విచారణ సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయని చంద్రబాబు తెలిపారు. నచ్చని వాళ్లపై ఈడీ, ఐటీ విభాగాలతో దాడులు చేయించి ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారని ప్రశ్నించారు. రేమో, మాపో తనపై కూడా ఈ తరహా దాడులు జరగబోతున్నాయని చంద్రబాబు తెలిపారు. బీజేపీ దాడులకు భయపడితే తాను దేశానికి ద్రోహం చేసినట్లేనని స్పష్టం చేశారు. దేశమే తనకు ముఖ్యమనీ, ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా టీడీపీ పోరాడుతుందని తేల్చిచెప్పారు.

More Telugu News