Chandrababu: విచారణ సంస్థలను మాపై ఉసిగొల్పారు.. అందుకే మాల్యా, మోదీలు విదేశాలకు పారిపోగలిగారు!: సీఎం చంద్రబాబు

  • పెద్ద నోట్ల రద్దు ఘోరంగా విఫలమైంది
  • బ్యాంకులపై ప్రజలు నమ్మకం కోల్పోయారు
  • ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తిరోగమనంలో ఉంది

బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ గా నిలిచిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రజలు ఇప్పుడు నమ్మకం కోల్పోయారనీ, తమ డిపాజిట్లు ఇవ్వరన్న అనుమానంతో అన్నింటిని విత్ డ్రా చేసుకుంటున్నారని అన్నారు. పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, స్టెర్లింగ్ బయోటిక్ సంస్థ ప్రమోటర్ నితీశ్ సందేశారా దేశాన్ని వదిలి ఎలా పారిపోగలిగారని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇలాంటి నేరస్తులను వదిలేసి, రాజకీయ నాయకులను వేధించడానికి నిఘా, విచారణ సంస్థలను కేంద్రం వాడుకుంటోందని మండిపడ్డారు. దేశరాజధాని లోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఇలాంటి రుణ ఎగవేతదారులపై చర్యలు తీసుకోకపోవడంతో బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయని సీఎం తెలిపారు.

ఈ అప్పులను సరిచేసేందుకు కేంద్రం ఓ బిల్లును తీసుకురావాలని అనుకుంటోందని, దీని ప్రకారం ప్రజల డిపాజిట్లను బ్యాంకులు స్వాధీనం చేసుకుంటాయనీ, ఈ భయంతోనే ప్రజలు బ్యాంకులకు దూరంగా జరుగుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని వ్యాఖ్యానించారు. సరైన ప్రణాళిక, పద్ధతి లేకుండా పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ను ఒకదానివెంట మరొకటి తీసుకొచ్చారని అన్నారు. దీని కారణంగా రూపాయి విలువ పడిపోవడంతో పాటు పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు.

దేశ జీడీపీ సైతం 6 నుంచి 7 శాతం మాత్రమే పెరుగుతోందని తెలిపారు. రైతుల ఆదాయంలో పెరుగుదల కేవలం 3 శాతం మాత్రమే ఉందని వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని కేంద్రం ఎప్పుడు రెట్టింపు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కరువు కాటకాలు, లోటు వర్షపాతం, వ్యాధుల కారణంగా దేశంలో రైతన్నలు అల్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. నోట్లరద్దు, జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థపై దెబ్బమీద దెబ్బ వేశాక, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో పారిశ్రామికవేత్తలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని అన్నారు.

More Telugu News