Chandrababu: పెద్ద నోట్లను రద్దు చేయమని చెప్పా.. కానీ మోదీ మాత్రం రూ.2,000, రూ.500 నోట్లను తెచ్చారు!: చంద్రబాబు

  • హామీల అమలులో బీజేపీ విఫలమైంది
  • వారికి ఎన్నికల పిచ్చి పట్టుకుంది
  • నోట్ల రద్దు ఇబ్బందులు ఇంకా ఉన్నాయి

ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పునరుద్ధరిస్తామనీ, రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛనిస్తామని చెప్పిన ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా మాట తప్పిందని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందిస్తామనీ, దేశాన్ని ప్రగతి పథంలో నడుపుతామని చెప్పి, బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకు మంచిరోజులు ఎప్పుడొస్తాయో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలోని కాన్ స్టి ట్యూషన్ క్లబ్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడారు.

ప్రస్తుతం దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో ప్రజలకు వివరించేందుకే తాను మీడియా ముందుకు వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. బీజేపీకి ఎన్నికల పిచ్చి పట్టుకుందని ఆయన విమర్శించారు. ఎన్నికలు సమీపించగానే ముందుగా 2-3 నెలలు అన్ని వ్యవస్థలను సంబంధిత రాష్ట్రంపై ప్రయోగిస్తున్నారని, అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

పెద్ద నోట్ల రద్దును తాను అప్పట్లో సమర్థించానని చంద్రబాబు అన్నారు. డిజిటల్ ఎకానమీ కమిటీ చైర్మన్ గా తాను ఓ నివేదికను సమర్పించానని తెలిపారు. దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లితేనే అవినీతిని అరికట్టగలమని తాను సూచించానన్నారు. ఇందుకోసం డిజిటల్ నగదుకు రాయితీలు భారీగా ఇవ్వాలని నివేదికలో సిఫార్సు చేసినట్లు చంద్రబాబు అన్నారు. తన సూచనలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.2,000, రూ.500 నోట్లను తెచ్చారని వెల్లడించారు.

కేంద్రం నిర్ణయంతో ఎన్నికలు లేదా మరే ఇతర వ్యవహారాల్లో అయినా అవినీతికి పాల్పడటం మరింత సులువు అయిపోయిందని వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఇప్పటివరకూ ఇబ్బంది పడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుకు ముందు మార్కెట్ లో ఎంత నగదు ఉందో, ప్రస్తుతం అంతకంటే ఎక్కువ మొత్తమే చలామణిలో ఉందని తెలిపారు. 

More Telugu News