Andhra Pradesh: నెల్లూరు టీడీపీలో రచ్చ.. మా ఏరియాలో తిరగలేవంటూ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!

  • వరికుంటపాడు మండలంలో ఘటన
  • మండల కన్వీనర్ గా మధుసూదనరావు నియామకం
  • వ్యతిరేకించిన ప్రస్తుత కన్వీనర్ వర్గీయులు

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరో 3 నెలల్లో పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతల అప్పగింత, నియామకాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించిన టీడీపీ కార్యకర్తలు, 'మా ప్రాంతంలో ఎలా తిరుగుతావో చూస్తాం' అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

జిల్లాలోని వరికుంటపాడు మండలంలో ఎంపీపీ సుంకర వెంకటాద్రి నివాసంలో టీడీపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బొల్లినేని.. గత నాలుగేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధిపై మాట్లాడారు. ఇటీవల మండలంలో టీడీపీ కార్యకర్తల నడుమ అసంతృప్తి నెలకొందన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు వీలుగా మండల బాధ్యతలను ఏఎంసీ మాజీ చైర్మన్‌ చండ్ర మధుసూదన్‌రావుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అక్కడే ఉన్న ప్రస్తుత కన్వీనర్‌ యర్రా చినబ్రహ్మయ్య వర్గీయులు బొల్లినేని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు కన్వీనర్ ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీనిపై చర్చ అనవసరమని ఎమ్మెల్యే చెప్పడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో యర్రా చినబ్రహ్మయ్య, చండ్ర మధుసూదన్‌రావు వర్గీయులు వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు.

దీంతో చినబ్రహ్మయ్య వర్గీయులు స్పందిస్తూ.. ‘ఇక మా ప్రాంతాల్లో ఎలా తిరుగుతావో చూస్తాం’ అని ఏకంగా ఎమ్మెల్యేను ఘాటుగా హెచ్చరించారు. ఈ ఘటన అనంతరం బొల్లినేని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏపీలో మరో 3 నెలల్లోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News