Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన స్మగ్లర్లు.. టాస్క్ ఫోర్స్ అధికారులపై గొడ్డళ్లతో దాడి!

  • పట్టుకోవడానికి యత్నించడంతో ఘటన
  • కాల్పులు జరిపిన అధికారులు
  • నలుగురు స్మగ్లర్ల అరెస్ట్

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అధికారులకు చుక్కలు చూపించారు. గొడ్డళ్లు, ఎలక్ట్రానిక్ రంపాలతో దాడికి దిగారు. చంద్రగిరి మండలం భీమవరం పాలెంకొండ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా టాస్క్ ఫోర్స్ అధికారులు ఇక్కడ కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన ఎర్ర చందనం స్మగ్లర్లు వారికి తారసపడ్డారు.

వెంటనే అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనాస్థలం నుంచి తప్పించుకోవడంలో భాగంగా తమిళ స్మగ్లర్లు రెచ్చిపోయారు. గొడ్డళ్లు, రంపాలతో అధికారులపైకి దూసుకొచ్చారు. చివరికి పరిస్థితి చేయిదాటుతున్న తరుణంలో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపిన అధికారులు.. నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ అధికారికి గాయాలయ్యాయి.

More Telugu News