Chandrababu: టార్గెట్ బీజేపీ... కాసేపట్లో ఢిల్లీకి చంద్రబాబు!

  • ఉదయం 10 గంటలకు ఎంపీలతో సమావేశం
  • ఆపై అందుబాటులోని జాతీయ నేతలతో భేటీ
  • మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం
  • పలు కీలకాంశాలను ప్రస్తావించనున్న బాబు

మరికాసేపట్లో హస్తినకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేరుకోనున్నారు. ఈ ఉదయం 9 గంటల తరువాత ఢిల్లీకి చేరుకునే ఆయన, ఉదయం 10 గంటలకు ఏపీ భవన్ లో ఎంపీలతో భేటీ కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎంపీలకు ఆదేశాలు వెళ్లాయి. అందరూ అందుబాటులో ఉండాలని సీఎంఓ అధికారులు ఎంపీలకు సమాచారాన్ని చేరవేశారు.

తన ఢిల్లీ పర్యటనలో అందుబాటులో ఉన్న జాతీయ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు, మధ్యాహ్నం 3 గంటలకు కాన్సిట్యూషన్ క్లబ్ లో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఆహ్వానాలు అందాయి. ఢిల్లీ వేదికగా కేంద్రం సాగిస్తున్న కుట్రలపై ఆయన మాట్లాడతారని తెలుస్తోంది. రాఫెల్ డీల్, జగన్ పై దాడి, ఆపరేషన్ గరుడ తదితర అంశాలను చంద్రబాబు వివరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచెయ్యి, పెండింగ్ లో ఉన్న అంశాలపై మీడియా ముందు చంద్రబాబు కేంద్రాన్ని నిలదీస్తారని సమాచారం. శ్రీకాకుళం జిల్లాను 'తిత్లీ' తుపాను తీవ్రంగా నష్టపరిస్తే, కేంద్రం స్పందన నామమాత్రంగా కూడా లేకపోవడాన్ని చంద్రబాబు ప్రస్తావించనున్నారు. ఇప్పటికే గవర్నర్ల వ్యవస్థను కేంద్రం వాడుకుంటోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, అదే విషయమై మరోసారి స్పందిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఏపీలో మారుతున్న పరిణామాలు, తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులు, సీబీఐ వ్యవహారాలను కూడా చంద్రబాబు ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. కాగా, చంద్రబాబు వెంట న్యూఢిల్లీకి మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు వెళ్లారు.

More Telugu News