Hyderabad: ‘మహా ఉద్యోగ మేళా’లో రసాభాస.. 'రేపు నిరుద్యోగ అభ్యర్థులెవరూ రావద్దన్న డీసీపీ విశ్వప్రసాద్

  • నాంపల్లిలో ఈరోజు ప్రారంభమైన ఉద్యోగ మేళా
  • ఎక్కువ సంఖ్యలో లేని రిక్రూట్ మెంట్ సంస్థల స్టాల్స్ 
  • నిరాశ చెందిన నిరుద్యోగుల ఆందోళన

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మహా ఉద్యోగ మేళా ఈరోజు ప్రారంభమైంది. ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ఉద్యోగమేళాకు సుమారు పది వేల మంది వరకు నిరుద్యోగులు హాజరయ్యారు. అయితే, రిక్రూట్ మెంట్ సంస్థలకు చెందిన స్టాల్స్ ఎక్కువ సంఖ్యలో ఇక్కడ లేకపోవడంతో పాటు సరైన ఏర్పాట్లు కల్పించలేదు.

దీంతో, నిరాశ చెందిన నిరుద్యోగులు మహా ఉద్యోగ మేళా అంటూ ఎందుకు ప్రచారం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగ మేళా నిర్వాహకుడు బి.వెంకటేశ్వర్లు తమను మోసం చేశారంటూ అక్కడి నిరుద్యోగ యువత ఆందోళనకు దిగారు. దీంతో, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కబెట్టారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, రేపు జరిగే ఉద్యోగ మేళాకు నిరుద్యోగ అభ్యర్థులెవరూ హాజరుకావొద్దని విజ్ఞప్తి చేశారు.

కాగా, ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ వెబ్ సైట్ నిర్వహిస్తోన్న కుష్మన్ వి వెబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ జాబ్ మేళా గురించి విస్తృత ప్రచారం చేసింది. మూడు రోజుల పాటు ఈ మేళా నిర్వహిస్తామని పేర్కొంది. ఐదో తరగతి నుంచి డిగ్రీ, పీజీ, సీఏ, బీడీఎస్, ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులెవరైనా ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగం పొందవచ్చని ప్రకటనలు, మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. 

More Telugu News