kolanukonda: ఆనాడు వైయస్ ఎలా స్పందించారో చంద్రబాబు మర్చిపోయినట్టున్నారు: కొలనుకొండ శివాజీ

  • జగన్ కు ఫోన్ చేసి పరామర్శించి ఉంటే బాగుండేది
  • పూర్తి వివరాలు తెలియక ముందే.. డ్రామా అంటూ వ్యాఖ్యానించడం సరికాదు
  • వైసీపీ నేతలు ఆవేశంలో మాట్లాడటం సహజం

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. గాయం నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ దాడిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, అసలైన దోషులను పట్టుకోవాలని కోరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలు, దాడులకు తావు లేదని చెప్పారు. జగన్ పై జరిగిన దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరు బాగోలేదని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి, జగన్ కు ఫోన్ చేసి, పరామర్శించి ఉంటే బాగుండేదని చెప్పారు. అలిపిరిలో తనపై మావోయిస్టులు దాడి చేసిన సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నేత వైయస్ ఎలా స్పందించారో చంద్రబాబు మర్చిపోయినట్టు ఉన్నారని అన్నారు.

పూర్తి వివరాలు తెలియకముందే ఈ ఘటనను డ్రామాగా ముఖ్యమంత్రి ఏకపక్షంగా మాట్లాడటం ఏమిటని కొలనుకొండ ప్రశ్నించారు. హత్యాయత్నాన్ని ఖండిస్తూ ప్రకటనలు చేసిన వారిపై కూడా ముఖ్యమంత్రి మండిపడటం సబబు కాదని అన్నారు. తగు విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి విస్మరిస్తే ఎలాగని అన్నారు.

తమ అధినేతపై దాడి జరగడాన్ని సహించలేక ఆ పార్టీ నాయకులు ఆవేశంలో మాట్లాడటం సహజమని, ఆందోళనలకు దిగడం కూడా సహజమేనని చెప్పారు. సున్నితమైన అంశాల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. సంక్షోభాలను అవకాశంగా తీసుకుని ముందుకు పోవాలని పదే పదే చెప్పే చంద్రబాబు... అత్యంత ప్రజాదరణ గల నాయకుడిపై దాడి జరిగితే , సమస్యను పెద్దదిగా చేసేలా, రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటం ఏమాత్రం వాంఛనీయం కాదని విమర్శించారు.

  • Loading...

More Telugu News