freelance journalist: సిరియా మిలిటెంట్ల నుంచి జపాన్‌ జర్నలిస్టుకు విముక్తి

  • సిరియా అంతర్యుద్ధంపై కవరేజీకి అక్కడికి వెళ్లిన జుంపై యసుదా
  • అతని కదలికలపై నిఘా పెట్టి నిర్బంధించిన ఉగ్రమూకలు
  • యసుదాను విడిపించేందుకు ప్రయత్నించిన వారినీ చంపిన ముష్కరులు

సిరియా అంతర్యుద్ధం కారణంగా పౌరులు ఎదుర్కొంటున్న ఈతిబాధలను ప్రపంచానికి తెలియజేయాలన్న సత్సంకల్పంతో ఆ దేశంలో అడుగుపెట్టి, ఉగ్రమూకల నిర్బంధంలో చిక్కి మూడేళ్లపాటు చిత్రహింసలు అనుభవించిన జపాన్‌ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు జుంపై యసుదాకు ఎట్టకేలకు విముక్తి లభించింది. 2015 సంవత్సరంలో అతన్ని అదుపులోకి తీసుకున్న సిరియా మిలిటెంట్లు వదిలేశారు. జుంపైను మిలిటెంట్లు నిర్బంధించాక అతని విడుదలకు తోటి జర్నలిస్టులు కొందరు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు సరికదా మిలిటెంట్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.

జర్నలిస్టుల తలలు నరికి అత్యంత పాశవికంగా చంపిన వీడియోలను కూడా మిలిటెంట్లు విడుదల చేశారు. ఈ చర్యలు చూశాక జుంపైను కూడా మిలిటెంట్లు చంపేసి ఉంటారని అంతా భావించారు. కానీ జుంపైని నానా రకాలుగా వేధించిన మిలిటెంట్లు అతన్ని ప్రాణాలతో మాత్రం ఉంచారు. మిలిటెంట్ల నిర్బంధం నుంచి బయటపడిన జుంపై దక్షిణ టర్కీకి చేరుకోగా, అక్కడి అధికారులు జపాన్‌ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. జపాన్‌ అధికారులు వెళ్లి తమ దేశ పౌరుడేనని గుర్తించడంతో గురువార జుంపై స్వదేశానికి చేరుకున్నాడు. ఈ విడుదలపై జపాన్‌ ప్రధాని షింజో అబే స్పందిస్తూ టర్కీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, 2003లో ఇరాక్‌ యుద్ధ సమయంలోనూ జుంపైని మిలిటెంట్లు బంధించి మూడు రోజుల తర్వాత విడిచిపెట్టారు. ఈ అనుభవాలపై జుంపై ‘యసుద ఈజ్‌ టఫ్‌’ పేరుతో పుస్తకాన్ని రాశారు. జుంపై విడుదలపై జపాన్‌ వాసుల్లో మిశ్రమ స్పందన కనిపించింది. చెప్పినా వినకుండా మాటిమాటికీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న జుంపైని విడిపించాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరనగా, కొందరు మాత్రం సానుభూతి వ్యక్తం చేశారు.

More Telugu News