Andhra Pradesh: వైజాగ్ ఎయిర్ పోర్టు రాష్ట్ర పోలీసుల పరిధిలోకి రాకుంటే రన్ వేపై జగన్ ను 8 గంటలు ఎందుకు నిర్బంధించారు?: వైవీ సుబ్బారెడ్డి

  • ఎయిర్ పోర్టులోకి ఏపీ పోలీసులు ఎలా వచ్చారు
  • శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశాలే
  • జగన్ పై దాడిలో సీఎం, డీజీపీలే ముద్దాయిలు

వైజాగ్ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై నిన్న దాడి జరగడం పోలీసుల వైఫల్యమేనని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేదని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. జగన్ పై దాడి ఘటనలో నిష్పాక్షిక విచారణ కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జగన్ చికిత్స పొందుతున్న సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి వద్ద సుబ్బారెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు.

శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయనీ, అవి కేంద్రం పరిధిలోకి రావని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కేవలం విమానాశ్రయం భద్రతనే సీఐఎస్ఎఫ్ బలగాలు పట్టించుకుంటాయని వెల్లడించారు. ఎయిర్ పోర్టులో రక్షణ కల్పించడం తమ బాధ్యత కాదని, అది కేంద్ర ప్రభుత్వ అంశమని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన ఖండించారు.

అలాంటప్పుడు వైజాగ్ లో ఏడాది క్రితం కొవ్వొత్తుల ర్యాలీ చేయడానికి వచ్చిన జగన్ ను విమానాశ్రయం రన్ వే పై ఏపీ పోలీసులు ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు. తమను 8 గంటలపాటు విమానాశ్రయం రన్ వేపై అడ్డగించిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.

నిన్న జగన్ పై దాడి జరిగిన అనంతరం నిందితుడిని పట్టుకుని వెళ్లింది కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులేనని తెలిపారు. జగన్ పై దాడి కేసులో ఏ1 నిందితుడిగా సీఎం చంద్రబాబు, ఏ2 నిందితుడిగా రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ లు ఉన్నారన్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా జగన్ రక్త నమూనాలపై రిపోర్టు వస్తుందనీ, అది అందుకున్న అనంతరం వైద్యుల సూచన మేరకు ఇంటికి వెళతారని పేర్కొన్నారు.

More Telugu News