hero shivaji: ఏపీ ముఖ్యమంత్రిని పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి: హీరో శివాజీ

  • మూడు నెలల్లో సీఎంని పక్కన పెట్టాలని చూస్తున్నారు
  • కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలు, ప్రభుత్వంపైనా ఉంది
  • చంద్రబాబు ఇమేజ్ వల్ల ఏపీలో అభివృద్ధి
ఏపీ ముఖ్యమంత్రిని ఏదో విధంగా పదవి నుంచి కూలదోయాలనే ప్రయత్నం జరుగుతోందని ప్రత్యేక హోదా సాధన సమితి నేత, హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ మూడు నెలల్లో ఆయన్ని పక్కన పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్రంలో రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు కీలకమైన వ్యక్తిగా ఎదుగుతారని పసిగట్టారని, అందుకే, ఆయన్ని పదవి నుంచి కూలదోసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా కూలదోయాలని చూస్తున్నారని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద, ప్రభుత్వం మీదా ఉందని శివాజీ సూచించారు.

ఏపీలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి చంద్రబాబు ఇమేజ్ వల్ల జరుగుతున్నదేనని, అయితే, అది శాశ్వతం కాదని, ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే పూర్తిగా అభివృద్ధి చెందుతుందని శివాజీ అన్నారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, ఈ పరిణామాలన్నీ గతంలో తాను చెప్పినవేనని, ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే ఇవి జరుగుతున్నాయని అన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రత్యేక హోదా కోసం తన పోరాటం మాత్రం ఆగదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోయాలని చూస్తే ఊరుకోనని హెచ్చరించారు.  
hero shivaji
Chandrababu

More Telugu News