Vijayawada: వృత్తి పౌరోహిత్యం... ప్రవృత్తి దొంగతనం.. దారి తప్పిన అర్చకుడు!

  • వ్యసనాలకు బానిసై స్నేహితుడితో కలిసి తప్పుడు మార్గం
  • అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుకు చిక్కిన వైనం
  • వీరి నుంచి రూ.20 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం

ఆలయంలో అనునిత్యం దేవుని సేవలో గడిపే అతన్ని వ్యసనం దారితప్పేలా చేసేంది. పవిత్రమైన అర్చక వృత్తిలో ఉంటూనే స్నేహితుడితో కలిసి చోరీలకు పాల్పడేలా పురిగొల్పింది. అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు చిక్కడంతో ముసుగు తొలగి అసలు విషయం వెలుగు చూసింది.

 పోలీసుల కథనం మేరకు... తూర్పుగోదావరి జిల్లా మానేపల్లి గ్రామానికి చెందిన ఉండి శివసుబ్రహ్మణ్యం అలియాస్‌ సుబ్బు (41) ఐటీఐ వరకు చదివాడు. దేవాలయాల్లో అర్చకుడిగా సేవలందిస్తుంటాడు. పదో తరగతి వరకు చదివి పాల వ్యాను డ్రైవర్‌గా పనిచేస్తున్న రావులపాలెం సమీపంలోని కొమరాజులంకకు చెందిన గుర్రాల దుర్గసాయి (20)తో ఇతనికి స్నేహం కుదిరింది. చెడు వ్యసనాలకు బానిసైన ఇద్దరూ సంపాదన కోసం తప్పుడు మార్గం ఎంచుకున్నారు.

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అజిత్‌సింగ్‌నగర్‌, సత్యనారాయణపురం, నున్న, మాచవరం, గుంటూరు జిల్లా ఉండవల్లి, తూర్పుగోదావరి జిల్లా మురముళ్ల, రాజమండ్రి అర్బన్‌ రంగంపేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. సాయితో జతకలవక ముందే శివసుబ్రహ్మణ్యం పేరు పోలీసుల అనుమానితుల జాబితాలో (సస్పెక్ట్‌ షీట్‌) ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం గవర్నర్‌పేట రాజగోపాలాచారి వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిద్దరినీ విజయవాడ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసు విచారణలో వీరు చేసిన చోరీల చిట్టాతోపాటు  పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన క్రైం డీసీపీ రాజకుమారి వీరివద్ద నుంచి రూ.20 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో 620 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.3 కిలోల వెండి, రూ.2.07 లక్షల నగదు, ఓ సెల్‌ ఫోన్‌ ఉన్నాయి.

  • Loading...

More Telugu News