L Ramana: రెండు మూడ్రోజుల్లో మహాకూటమి సీట్ల సర్దుబాటవుతుంది: టీ-టీడీపీ అధ్యక్షుడు రమణ

  • మూడు విడతలుగా కూటమి అభ్యర్థులను ప్రకటిస్తాం
  • తొలి విడతలో 50-60 మంది అభ్యర్థులను వెల్లడిస్తాం
  • ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రాజకీయ నాయకుడు చంద్రబాబు

కేసీఆర్ అప్రజాస్వామిక పరిపాలనకు చరమగీతం పాడేందుకే తమ మహాకూటమి ఏర్పడిందని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతొో మాట్లాడుతూ, రెండు మూడు రోజుల్లోపు సీట్ల సర్దుబాటు అవుతుందని, పార్టీల వారీగా సంఖ్యను అనుకుని, మూడు విడతలుగా కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.

తొలి విడతలో 50 నుంచి 60 మంది అభ్యర్థులను, రెండో విడతలో ముప్పై, మూడో విడతలో మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణలో టీడీపీ అవసరమా అని, టీడీపీ ఆంధ్రాపార్టీ అని కేసీఆర్, ఆయన కుటుంబం వ్యాఖ్యలు చేయడంపై రమణ స్పందిస్తూ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల హృదయాల్లో చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే రాజకీయనాయకుడని, హైదరాబాద్ కు హైటెక్ సిటీ తీసుకురావడం ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తి బాబు అని కొనియాడారు.

ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదరాబాద్, ఖమ్మం, ఇంకొన్ని చోట్ల నిర్వహించే బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారని స్పష్టం చేశారు. మహాకూటమి సాధించే విజయంలో తెలుగుదేశం పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పిన రమణ,  రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు తమ కూటమి పాటుపడుతుందని వ్యాఖ్యానించారు.

More Telugu News