Telangana: తెలంగాణ ఎన్నికలకు మేం రెడీ.. అభ్యర్థుల నేరచరిత్రను 24 గంటల్లో ప్రజలు తెలుసుకోవచ్చు!: సీఈసీ ఓపీ రావత్

  • ఓటర్ల జాబితాపై పార్టీల ఫిర్యాదులు స్వీకరించాం
  • అభ్యర్థుల నేరచరిత్ర తెలుసుకునేలా నామినేషన్ పత్రాలు
  • తాజ్ కృష్ణ హోటల్ లో మీడియా సమావేశం

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు చేయడంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అద్భుతంగా పనిచేస్తున్నారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా అన్ని జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించామని వెల్లడించారు. ఓటర్ల జాబితాపై పలు పార్టీల నుంచి ఫిర్యాదులు స్వీకరించామని పేర్కొన్నారు. వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను బయటపెట్టేలా నామినేషన్, అఫిడవిట్ పత్రాలను రూపొందించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు దాఖలుచేసిన అఫిడవిట్ ను 24 గంటల్లోగా ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తామన్నారు.

ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించేవారిపై ఫిర్యాదు చేయడానికి సీ-విజిల్ అనే ఆండ్రాయిడ్ యాప్ ను తీసుకొచ్చామన్నారు. ఎన్నికల సందర్భంగా 100 శాతం వీవీ ప్యాట్ యంత్రాలు ఉన్న ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసారి ఉద్యోగుల కోసం ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ను వాడుతున్నట్లు ఓపీ రావత్ తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నికల కోసం 32,574 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు తెలంగాణ సిద్ధంగా ఉందనీ, ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయన్నారు. డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న ప్రకటించనున్నారు.

More Telugu News