Karnataka: బళ్లారి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గాలి జనార్దనరెడ్డి ప్రచారం లేనట్టే!

  • కోర్టు కేసు నేపథ్యంలో ఆయన ప్రవేశానికి అడ్డంకులు
  • శ్రీరాములు సోదరి తరపున ప్రచారానికి ఆసక్తి చూపినా స్పందించని అధిష్ఠానం
  • గడచిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ‘గాలి’ ప్రచారం కోరుకోని బీజేపీ

గనుల తవ్వకం కేసులో బెయిల్‌పై బయట ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి బళ్లారిలో అడుగు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బెయిలు నిబంధనల మేరకు ఆయనకు బళ్లారిలోకి ప్రవేశం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి పార్టీ నుంచి అనుమతి లభిస్తే తద్వారా కోర్టును ఆశ్రయించి మార్గం సుగమం చేసుకోవాలన్న 'గాలి' ప్రయత్నాలకు భారతీయ జనతా పార్టీ నుంచి సానుకూలత వ్యక్తం కావడం లేదు. బళ్లారి లోక్‌సభ ఉప ఎన్నికల్లో తన సన్నిహితుడు శ్రీరాములు సోదరి తరపున ప్రచారానికి ఆసక్తి చూపినా బీజేపీ అధిష్ఠానం నుంచి సానుకూలత రాలేదు.

ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అతిరథులంతా రంగంలోకి దిగారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి డి.కె.శివకుమార్‌కు, గాలికి మధ్య వైరం ఈనాటిది కాదు. ఈ నేపథ్యంలో ఆయనకు దీటైన పోటీ ఇవ్వాలంటే తానూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అధిష్ఠానానికి జనార్దనరెడ్డి లేఖ రాసినా, అటు నుంచి స్పందన రాలేదు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనార్దనరెడ్డి అత్యుత్సాహం చూపినా ఆయనతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బీజేపీ చీఫ్‌ అమిత్‌షా ప్రకటించిన విషయం తెలిసిందే. అదే వైఖరిని ఉప ఎన్నికల సందర్భంలోనూ బీజేపీ వ్యక్తం చేసినట్లు సమాచారం.

More Telugu News