Tamilnadu: 28న పురచ్చితలైవి జయలలిత విగ్రహావిష్కరణ.. విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం

  • పార్టీ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రకటన
  • అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం
  • రూపురేఖలు తేడాగా ఉండడంతో మార్చాలన్న డిమాండ్‌

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలిత మృతే కాదు చివరికి ఆమె విగ్రహం ఆవిష్కరణ కూడా వివాదాస్పదమవుతోంది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత కన్నుమూయగా, ఆమె మృతిపై పలు సందేహాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ ప్రధాన కార్యాయంలో ఏర్పాటు చేసిన ఆమె విగ్రహాన్ని మార్చాలన్న డిమాండ్‌ ఎక్కువైంది. దీంతో ఇప్పటికే ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈనెల 28వ తేదీన ఆవిష్కరించాలని ముహూర్తం ఖరారు చేసినా, కొన్ని రోజుల్లోనే ఈ విగ్రహం స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం విశేషం. ప్రస్తుతం ఏర్పాటు చేసిన విగ్రహంలో అమ్మ పోలికలు లేవంటూ విమర్శలు వెల్లువెత్తడమే ఇందుకు కారణం.

వివరాల్లోకి వెళితే... తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో పాటు మంత్రి తంగమణి, మాజీ మంత్రి కె.పి.మునుస్వామి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జయలలిత విగ్రహాన్ని ఈ నెల 28వ తేదీన ఆవిష్కరించాలని నిర్ణయించారు. అదే సమయంలో విగ్రహంలో అమ్మ పోలికలు లేవంటూ వస్తున్న విమర్శపైనా చర్చించారు. దీంతో అవసరమైతే ఈ విగ్రహం స్థానంలో కొత్తదాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

More Telugu News