agri gold: అగ్రిగోల్డ్ ఆస్తులు కొనవద్దని జీఎస్సెల్ గ్రూపును అమిత్ షా బెదిరించారు!: టీడీపీ నేత కేశినేని నాని

  • కొంటే ఇబ్బందులు వస్తాయని చెప్పారు
  • చంద్రబాబుపై ఎన్ని కుట్రలు చేసినా ఏంకాదు
  • బీజేపీ నేతలను తరిమితరిమి కొడతాం

ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన జీఎస్సెల్ గ్రూపును బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బెదిరించారని టీడీపీ నేత కేశినేని నాని తెలిపారు. ముంబైలోని గ్రూపు ప్రతినిధులను షా ఢిల్లీకి పిలిపించారన్నారు. తమ వాళ్లు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో పాల్గొంటారనీ, కాబట్టి తప్పుకోవాల్సిందిగా అమిత్ షా వాళ్లకు వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఈ రోజు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు.

అగ్రిగోల్డ్ భూముల్ని కొంటే ఇబ్బంది పడతారని షా వారిని హెచ్చరించారన్నారు. గత నాలుగేళ్లలో అమిత్ షా కొడుకు కంపెనీ భారీ స్థాయికి ఎలా ఎదిగిందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులన్నీ బీజేపీ దగ్గర పెట్టుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తెరిచిన పుస్తకమనీ, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఆయన్ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ తో, ఆంధ్రప్రదేశ్ లో పవన్, జగన్ తో బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని నాని అన్నారు. కోర్టు మార్గదర్శకాల ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులను కచ్చితంగా ఆదుకుంటామని నాని హామీ ఇచ్చారు.

అగ్రిగోల్డ్ కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడిన 100 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున సాయం చేసి ఆదుకున్నామని గుర్తుచేశారు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకుంటే ఏపీలోకి రాకుండా తరిమితరిమి కొడతామని హెచ్చరించారు. అవినీతిలో గుజరాత్ టాప్ గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పాయన్నారు. ఏపీ మాత్రం ఆ జాబితాలో చిట్టచివరన ఉందని అన్నారు. 

More Telugu News