Medak District: మేడ్చల్ జిల్లాలో పరస్పరం దాడులు... కత్తిపోట్లతో ఒకరి మృతి

  • మరో ముగ్గురికి గాయాలు
  • ఒకరి పరిస్థితి విషమం
  • మేడ్చల్‌ జిల్లా జవహర్‌ నగర్‌లో ఘటన
ఒకరిపై మరొకరు కత్తులు దూసుకున్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో రెండు గ్రూపుల సభ్యులు పరస్పరం దాడులకు దిగినట్లు భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే...మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాప్రాల్‌కు చెందిన విక్కీ అలియాస్‌ చిన్నారెడ్డి, కృష్ణ, జోసఫ్‌, వికాస్‌ కుమార్‌లకు, అదే ప్రాంతానికి చెందిన శ్రావణ్‌ అనే వ్యక్తికి మధ్య పాతకక్షలున్నాయి. తరచూ వీరు గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రావణ్‌పై దాడి చేసేందుకు విక్కీ బృందం స్కెచ్‌ వేసింది. కత్తులతో బయలుదేరిన విక్కీ, అతని స్నేహితులు శ్రావణ్‌ ఇంటి వద్ద కాపు కాశారు. అదను చూసి ఇంట్లోకి ప్రవేశించి దాడిచేశారు.

ప్రమాదాన్ని ఊహించిన శ్రావణ్‌ అప్రమత్తమై ఎదురుదాడికి దిగాడు. ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడులు చేసుకోగా తీవ్రంగా గాయపడిన విక్కీ అక్కడికక్కడే చనిపోయాడు. విక్కీ బృందంలోని వికాస్‌తోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. వికాస్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Medak District
two groups rides
one dead

More Telugu News