Social Media: కేసీఆర్‌, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగ్స్ పెట్టిన ఇద్దరిపై కేసు నమోదు

  • మరొకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు
  • ఫొటోలు మార్ఫింగ్‌చేసి అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టింగ్స్
  • టీఆర్‌ఎస్‌ నాయకురాలు ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న పోలీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టింగ్స్‌ పెట్టిన ఇద్దరు వ్యక్తులపై బంజరాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మరో వ్యక్తిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిలింనగర్‌ వాసి మల్లేష్‌, ఇదే ప్రాంతానికి చెందిన డాన్‌ రాజు  కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వాటికి అసభ్యకర వ్యాఖ్యలు జోడించి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. అలాగే, తీవ్ర పదజాలంతో వాయిస్‌ మెసేజ్‌లు పోస్టు చేస్తున్నారు.

 వీరి పోస్టింగ్స్‌ను గమనించిన టీఆర్‌ఎస్‌ నాయకురాలు విజయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో వీరిపై ఐపీసీ 504, 505 (1), ఐటీ యాక్ట్‌ 67 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను కించ పరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్స్‌ పెడుతున్న నిజాంపేట టీడీపీ నాయకుడు డి.రాజేష్‌ను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యక్తులను, పార్టీలను మితిమీరి కించపరిచే వ్యక్తులపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Social Media
postings
cases

More Telugu News