Uttar Pradesh: యూపీలో వృద్ధుడిపై రాళ్లతో దాడిచేసి హతమార్చిన కోతులు.. ఆందోళనలో గ్రామస్తులు!

  • ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పత్ జిల్లాలో వింత ఘటన
  • రాళ్లతో దాడిచేస్తున్న కోతులు
  • కేసు నమోదు చేయాలంటున్న ప్రజలు

సాధారణంగా కోతులు అన్నాక ఎక్కడైనా కరుస్తాయి, రక్కుతాయి. కానీ ఉత్తరప్రదేశ్ లోని కోతులు మాత్రం కాస్త డిఫరెంట్. అక్కడి కోతులు ఏకంగా రాళ్లతో మూకుమ్మడిగా దాడి చేసి ఓ వృద్ధుడిని పొట్టన పెట్టుకున్నాయి. దీంతో కోతులపై కేసు నమోదు చేయాలని మృతుడి బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

యూపీలోని బాగ్‌పత్ జిల్లా టిక్రీ గ్రామానికి చెందిన ధర్మపాల్ సింగ్ (72) తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భోజనం వండేందుకు కట్టెపుల్లల కోసం ఊరికి సమీపంగా ఉన్న అటవీ ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను గమనించిన కోతుల గుంపు ఒకటి రెచ్చిపోయింది. రాళ్లతో ఒక్కసారిగా ఆయనపై దాడికి తెగబడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ధర్మపాల్ సింగ్ రక్తసిక్తమై ఇంటికి చేరుకున్నారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ధర్మపాల్ సింగ్ ను చంపిన కోతులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే తమ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.

గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. కోతుల దాడుల కారణంగా భయంభయంగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కోతులపై కేసు నమోదు చేయాలన్న కుటుంబ సభ్యుల డిమాండ్ పై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

More Telugu News