Andhra Pradesh: శ్రీకాకుళం సహాయక చర్యలపై నారా లోకేశ్ సమీక్ష.. జియోకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి!

  • 60 జనరేటర్లను వినియోగిస్తున్నాం
  • పంట నష్టంపై త్వరితగతిన అధ్యయనం
  • గ్రామాలకు ట్యాంకర్లతో నీరు అందిస్తున్నాం

తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, ఈదురుగాలులకు వందలాది ఎకరాల్లో పంట దెబ్బతినగా, వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన ప్రభుత్వం 100 మందికిపైగా డిప్యూటీ కలెక్టర్లను రంగంలోకి దించింది. అలాగే సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ కూడా జిల్లాలోనే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

దసరా పండుగ వేళ మంత్రి లోకేశ్ ఈ రోజు మందసలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. గ్రామాల్లో జరుగుతున్న సహాయక చర్యలపై ప్రత్యేకంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు మంచినీరు సరఫరా చేసేందుకు వీలుగా 60 జనరేటర్లు వినియోగిస్తున్నామని తెలిపారు. గ్రామాలన్నింటికి ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందజేస్తున్నామని వెల్లడించారు. రైతన్నలకు జరిగిన పంట నష్టంపై అధ్యయనం వేగంగా సాగుతోందని పేర్కొన్నారు.

డేటా ఎంట్రీ కోసం ఉచితంగా వైఫై అందిస్తున్నందుకు జియో సంస్థకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తుపాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద పునరుద్ధరణ పనులు చేపడతామని లోకేశ్ అన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు 40 క్రేన్లు, 900 మంది సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు.

More Telugu News